Sunday, November 26, 2017

Ladakh

మనోహరం... లద్దాఖ్‌ సరస్సుల విహారం..!
‘సుర్రో సుర్రన్నాడే...’ అంటూ శక్తి సినిమాలో ఇలియానా మెలికలు తిరుగుతూ అందాలొలికించిన ప్రదేశం గుర్తుందా... అలాగే ‘సత్‌రంగీ రే...’ అంటూ మణిరత్నం దిల్‌ సేలో చిత్రీకరించిన పాటా, త్రీ ఇడియట్స్‌ క్లైమాక్స్‌ సీనూ... ఇలా అనేక సినిమాల్లో కనువిందు చేస్తోన్న లద్దాఖ్‌ సరోవర అందాలను ప్రత్యక్షంగా చూసి వచ్చాం’ అంటూ ఆ అనుభవాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్‌ కె.సీతారత్న.
భిన్న ప్రాంతాలూ అక్కడ మాత్రమే జీవించే విభిన్న రకాల జంతువులూ పక్షులూ వృక్షజాతులూ ఆటవిక తెగలూ... ఇలా జీవ వైవిధ్యానికి మరో పేరు భారతదేశమైతే; అరుదైన, కనుమరుగవుతున్న జీవజాతులతో కూడిన బయోరిజర్వ్‌లూ అద్దాల్లా మెరిసే నీలి రంగు సరోవరాలకూ మారుపేరే లద్దాఖ్‌. ఎత్తైన ఆ మంచుకొండల్లోని ముదురు నీలిరంగుల్లో ప్రకాశించే సరస్సుల సోయగం వర్ణించనలవి కాదు. అందుకే అచ్చంగా ఆ సరస్సుల్ని సందర్శించాలనుకుని ప్రణాళిక చేసుకున్నాం. జూలై 30వ తేదీన ముందుగా లేహ్‌కు చేరుకున్నాం. అక్కడి నుంచి ఇన్నోవాలో పాంగోంగ్‌ త్సొ సరస్సుకి బయలుదేరాం. ఇది 40 శాతం భారత భూభాగంలోనూ 60 శాతం టిబెట్‌(చైనా) లోనూ ఉంది. భారత్‌-చైనా సరిహద్దు నియంత్రణ రేఖమీద ఉన్నందున నిరంతరం సైన్యం కాపలా ఉంటుంది. విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే లైన్‌ పర్మిట్‌ ఉండాలి. మారిన రాజకీయ పరిస్థితుల వల్ల దేశీయులు కూడా ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ తీసుకోవాలి. అందుకే లేహ్‌(లే)లోనే పర్మిట్‌తోబాటు వాటి జిరాక్స్‌ ప్రతులూ, ఆధార్‌, మా ఫొటోలూ అన్నీ తీసుకున్నాం. వాటిని చెక్‌పోస్టుల దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది.
కత్తిమీద సవాల్‌!
లేహ్‌ నుంచి బయలుదేరి, 45 కిలోమీటర్ల దూరంలోని ‘కార్‌’ అనే ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుంచి 17,800 అడుగుల ఎత్తులోని చాంగ్‌ లా పాస్‌కి చేరుకున్నాం. ఇది ఎత్తైన కొండదారుల్లో రెండోది. అక్కడ ఉన్న ఓ చిన్న హోటల్లో టీ తాగి, చుట్టుపక్కల దృశ్యాలను ఫొటోలు తీసుకుని మళ్లీ బయలుదేరాం. నెమ్మదిగా ప్రవహిస్తున్న సింధునదినీ దాని మధ్యలో వూదారంగు పూలతో నిండిన మట్టి దిబ్బల్నీ చూస్తూ మా ప్రయాణం సాగింది. అక్కడి నుంచి మరో 58 కి.మీ. ప్రయాణించాక తంక్‌సే అనే ప్రాంతం వచ్చింది. ఇది దాటాక రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ ప్రాంతాన్ని పాగల్‌నాలా అంటారు. అక్కడక్కడా హిమనదాల నుంచి కిందకి ప్రవహించి వచ్చిన నీరు మూడునాలుగు అడుగుల లోతు వరకూ ఉంది. ఆ ప్రవాహాలని దాటడం కత్తిమీద సవాలే. టైర్లు రాళ్ల మధ్య ఇరుక్కుని ముందుకీ వెనక్కీ కదలని పరిస్థితి. ఎలాగో కష్టపడి 32 కి.మీ. ప్రయాణించాక స్పాంగుర్‌ త్సొ సరస్సు వచ్చింది. ఇది దాటాక మేం బస చేసే పాంగోంగ్‌ త్సొ రిసార్టుకు చేరుకున్నాం.
ఈ ప్రయాణంలో వాతావరణం ఎప్పుడెలా మారిపోతుందో తెలీదు. రోడ్డు అస్సలు బాగుండదు. టెలిఫోనూ సెల్‌ఫోను సంకేతాలు చేరని ఎత్తైన ప్రాంతం. అక్కడ వీచే ఈదురు గాలుల తాకిడికి చెవులు చిల్లులు పడతాయేమో అనిపిస్తుంది. వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం చాలా తక్కువ. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిజన్‌ సిలిండర్లను ఉపయోగించే విధానాన్ని తెలుసుకుని, వాటిని ఉపయోగించడానికి మానసికంగా సిద్ధపడినవారే ఈ ప్రాంతాన్ని పర్యటించాలి. చలికాలంలో అయితే పాంగోంగ్‌ సరస్సు గడ్డ కట్టి ఉంటుంది. మే నుంచి మంచు కరగడం ప్రారంభమవుతుంది. అందుకే అప్పటి నుంచి సెప్టెంబరు వరకూ దీన్ని ఎక్కువమంది సందర్శిస్తుంటారు. భూమ్మీద ఉన్న ఎత్తైన ఉప్పునీటి సరస్సు ఇదే.
కరెంటు ఉండదు!
సాయంత్రం నాలుగు గంటలకు సరస్సు దగ్గరకు చేరుకున్నాం. అది చూశాక అప్పటివరకూ పడ్డ కష్టమంతా హుష్‌కాకిలా ఎగిరిపోయింది. 14,270 అడుగుల ఎత్తులో నెమలిపింఛం వర్ణంలోని నీటితో మెరిసిపోతుందా ఉప్పునీటి సరస్సు. అప్పటికే అక్కడ చాలామంది సందర్శకులు ఉన్నారు. క్రమంగా సూర్యాస్తమయం కావడంతో పసుపూ బంగారు వర్ణాలు సంతరించుకున్న నీలాకాశ అందాలు సరస్సుల్లో ప్రతిఫలిస్తున్నాయి. అలా చాలాసేపు ఆ సరస్సు దగ్గరే ఉండి, మారుతున్న ఆకాశంలోని రంగుల్నీ హిమశిఖర సౌందర్యాన్నీ చూస్తూ గడిపేశాం. ఎనిమిది గంటలకు చీకట్లు కమ్ముకు రావడంతో రిసార్టుకి వచ్చేశాం. రిసార్టుల్లోగానీ గ్రామాల్లోగానీ కరెంటు ఉండదు. రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ రిసార్టుల వాళ్లే జనరేటర్ల ద్వారా చిన్న చిన్న బల్బులు వెలిగేలా చూస్తారు. రాత్రి పది గంటలకు ఆ జనరేటర్‌ కూడా బంద్‌ అవుతుంది. రాత్రివేళ ఉపయోగించుకోవడానికి హై పవర్‌ టార్చిలైటు వెంట ఉండాల్సిందే. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌ కారణంగా ఆ రాత్రంతా నిద్రలేదు. ట్యాబ్లెట్లు వేసుకుని, రెండు గంటలపాటు ఆక్సిజన్‌ తీసుకోవాల్సి వచ్చింది.
మర్నాడు ఉదయం రిసార్టు కుర్రాడు ఇచ్చిన వేడినీళ్లతో కాలకృత్యాలు ముగించుకుని అల్పాహారం తీసుకుని, ఉదయ కాంతిలో సరస్సు అందాలను మరోసారి తనివితీరా చూసి, తిరుగుప్రయాణమయ్యాం. లేహ్‌ ప్రాంతానికి చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటలయింది. త్సొ మోరిరి, త్సొ కర్‌ ప్రాంతాలకు వెళ్లడానికి ఇన్నోవాను ఏర్పాటుచేసుకున్నాం. మధ్యలో పెట్రోల్‌ దొరకదు కాబట్టి మొత్తం 400 కి.మీ. దూరానికి సరిపడా పోయించుకుని బయలుదేరాం. ఈ సరస్సులకు వెళ్లడానికీ లేహ్‌ పట్టణంలోనే రిస్ట్రిక్టెడ్‌ ఏరియా అనుమతి తీసుకుని బయలుదేరాలి.
ఆరు గంటలకే లేహ్‌ నుంచి బయలుదేరి, ఉప్పి మీదుగా చుమ్‌థాంగ్‌ చేరుకున్నాం. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి, కాసేపు విశ్రమించాం. అక్కడ ఓ బౌద్ధ ఆరామం, వేడినీటి బుగ్గలూ ఉన్నాయి. వాటిని సందర్శించి ప్రయాణం కొనసాగించాం. దారిపొడవునా సింధునది మా వెంటే వస్తోంది. అక్కడక్కడా అది గట్లు తెంచుకుని దారికి అడ్డం పడటంతో వాహనాలు కూడా ఆగిపోయాయి. నదీప్రవాహం రోడ్లమీద మూడు అడుగుల ఎత్తు చేరడంతో అసలు అది నదా లేక రోడ్డా అనేది కూడా తెలిసేది కాదు. రక్షణ దళాలు రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నా ప్రవాహాన్ని నియంత్రించడం వాళ్ల వల్ల కావడం లేదు. మొత్తమ్మీద ఆర్మీ వాహనాల సాయంతో బయటపడ్డాం.
పష్మీనా గొర్రెలతో...
చుమ్‌థాంగ్‌ నుంచి 60 కి.మీ. ప్రయాణించాక త్సొ మోరిరి సరస్సుకి చేరుకున్నాం. కొంతదూరం ప్రయాణించగానే పష్మీనా జాతికి చెందిన తెల్లని గొర్రెల్ని మేపుతున్న స్థానిక తెగల స్త్రీ పురుషులు కనిపించారు. టిబెట్‌ నుంచి వలస వచ్చిన చాంగ్‌పాస్‌ అనే సంచార తెగ ఇక్కడ నివసిస్తోంది. వీళ్లు వ్యవసాయం కూడా చేస్తారు. ప్రభుత్వ సహకారంతో ఈ పష్మీనా గొర్రెల్ని పెంచి వాటి నుంచి తీసిన బొచ్చుని విక్రయిస్తారు. ఇది ఖరీదైన ఉన్నిగా పేరొందింది. దీంతో చేసే శాలువాలూ దుప్పట్లూ పలుచగా ఉంటాయి. కానీ చలి నుంచి బాగా కాపాడతాయి.
సాయంత్రం ఐదు గంటలకు అక్కడకు చేరుకున్నాం. టెంటులో లగేజీ పెట్టేసి, రిసార్టు వారిచ్చిన కాఫీ తాగి కెమెరాలతో సరస్సు దగ్గరకు చేరుకున్నాం. ఇది మంచినీటి సరస్సు. సముద్రమట్టానికి 15,075 అడుగుల ఎత్తులో ఉంది. దీని చుట్టూ హిమాలయ శ్రేణులు 18 నుంచి 20 వేల అడుగుల ఎత్తులో కనిపిస్తాయి. ఆ మధ్యలో ఉన్న లోయనే రప్‌షు అంటారు. దాని చుట్టూ తిరుగుతూ హిమాలయాల్లో మాత్రమే కనిపించే సూర్యాస్తమయ అందాలను చూస్తూ గడిపేశాం. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. టిబెట్‌కు చెందిన అడవి గాడిదలైన కియాంగ్‌లు ఈ ప్రాంతానికే పరిమితం. ఎరుపురంగు నక్కలూ, బార్‌ హెడ్‌ బాతులూ కూడా ఇక్కడ కనిపిస్తాయి.
సరస్సు వద్ద పెద్ద ఆర్మీ క్యాంపు ఉంది. అక్కడ ఉన్న గ్రామం పేరు కొర్జొక్‌. పర్యటక రిసార్టులకు ఈ సైనిక క్యాంపు నుంచే రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ కరెంటు సరఫరా ఇస్తారు. మిగిలిన సమయాల్లో కరెంటు ఉండదు. ఫోను సిగ్నల్స్‌ ఉండవు. ఇవన్నీ లద్దాఖ్‌లో అత్యంత మారుమూల ప్రదేశాలు. రాత్రయ్యేసరికి మెల్లగా తలనొప్పి పెరిగింది. కళ్లు తిరగడం కూడా ప్రారంభమయ్యేసరికి సిలెండర్‌ ద్వారా ఆక్సిజన్‌ను రెండు గంటలపాటు పీల్చాల్సి వచ్చింది.
మర్నాడు ఉదయాన్నే లేచి సరస్సు దగ్గరకు వెళ్లాం. అప్పుడు కనిపించిందో దృశ్యం. దాదాపు మూడు వందలకు పైగా ఉన్న బార్‌హెడెడ్‌ బాతుల గుంపు మేం ఉన్న వైపునకు ఒడ్డుకి రాసాగింది. మేం వాటికి కనిపించకుండా మట్టి దిబ్బల వెనక నిలబడి ఫొటోలు తీసుకున్నాం. ఒక గుంపు తరవాత మరో గుంపు వచ్చింది. అవన్నీ కూడా వలస పక్షులే. వీటికి మనదేశంలోని బ్రీడింగ్‌ సెంటర్లు లద్దాఖ్‌ సరస్సులు మాత్రమే. ఇక్కడే గుడ్లు పెట్టి, పొదిగి వాటికి ఎగరడం నేర్పి తిరిగి తమతోబాటు సైబీరియాకి తీసుకుని పోతాయి. అలా అవి ప్రయాణిస్తున్నంత మేర వెళుతూ తిరిగి అలసిపోయాం. సాయంత్రం నడిచే ఓపికలేక వాహనంలోనే సరస్సు దగ్గరకు వెళ్లి, సాయం సంధ్యా సమయంలో తళుకులీనే హిమవర్ణ సోయగాలను వీక్షించి ఆనందంగా బసకు చేరుకున్నాం.
ఆ మంచుకొండల్లో మంచు కురవదు!
దాదాపు 130 అడుగుల లోతులో 26 కి.మీ. పొడవూ సుమారు ఐదు కిలోమీటర్ల వెడల్పూ ఉండే త్సొ మొరిరి సరస్సు అందాలను మరోసారి చూసి, మర్నాడు ఉదయాన్నే తిరుగు ప్రయాణమయ్యాం. దారిలో మాహి అనే వంతెన వచ్చింది. అక్కడి నుంచి దారి మళ్లి ప్రయాణిస్తే త్సొ కర్‌ సరస్సు వస్తుంది. అదీగాక సింధునది మేం వచ్చిన దారిని ముంచెత్తడంతో ఆర్మీ వాళ్లు కూడా రూటు మార్చుకుని ఆ దారిలోనే ప్రయాణించారు. మార్గం అంతా గుంతలమయం. రప్‌షు లోయలోని లోతైన సరస్సు ఇది. దీని చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల మోరి మైదానం ఉంది. దీని వెనకగా తుగ్‌జి, గర్షన్‌ అనే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అనేక సంవత్సరాల కిందట త్సొ కర్‌ సరస్సు ఈ పర్వతాల వరకూ విస్తరించి ఉండేదట. ఉప్పునీటి సరస్సు కావడంతో చాంగ్‌ పా అనే సంచారజాతి వారు సరస్సు నుంచి ఉప్పును తీసి టిబెట్‌కు తరలించేవారట. చిత్రమైన విషయం ఏంటంటే అక్కడ మంచు కురవదు, వర్షం పడదట. ఉష్ణోగ్రత వేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడూ, చలికాలంలో -40 డిగ్రీలూ ఉంటుంది.
ఇక్కడ ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. అందులో బ్లాక్‌ హెడెడ్‌ కొంగలూ టిబెటన్‌ బాతులూ తోడేళ్లూ నక్కలూ మార్మోట్‌లూ గోధుమరంగు తలతో ఉండే గల్స్‌... వంటి అరుదైన జీవజాతులు ఉన్నాయి. అయితే మేం సరస్సు దగ్గరకు మాత్రం వెళ్లలేకపోయాం. ఎందుకంటే దానిచుట్టూ బురదతో నిండిన నీటి మొక్కలు ఉన్నాయి. అక్కడ కాలేస్తే లోపలకు కూరుకుపోతాయట. పైగా సరస్సు అంతా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంది. అందుకే దూరం నుంచే దాన్ని చూసి వెనుతిరిగాం.